ముగించు

చరిత్ర

నల్గొండ జిల్లా చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు పరిపాలించిన ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం. శాతవాహన, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండిన, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, కుతుబ్‌షాహీ, ఆసఫ్‌ జాహీ, ఆధునిక రాజకీయ పరిపాలన అంతటికీ ఇది ఒక ప్రదర్శనశాల. మహాకవులు, పోరాటయోధులు, సాహితీవేత్తలు పుట్టిన గడ్డ నల్గొండ.గ్రంథాలయ ఉద్యమాలకు, భూదానోద్యమాలకు, తెలంగాణా సాయుధ పోరాటాలకు, విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన నల్గొండ జిల్లా ఎన్నెన్నో మార్పులతో 1905లో ప్రత్యేకంగా ఏర్పడింది. పట్టణం ప్రాచీన నామం నీలగిరి. రెండు నల్లరాతి కొండల నడుమ ఉన్న ప్రదేశం కావడంతో దీనికి నీలగిరి అని పేరు వచ్చింది. నీలగిరి క్రమంగా నల్లకొండ.. నల్లగొండ… నల్గొండగా స్థిరపడింది. 1961 దాకా జిల్లా ఎల్లల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

చారిత్రక అంశాలు

జిల్లా ప్రాచీన కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీస్తు పూర్వం రెండున్నర వేల ఏళ్ల నాటి నాగరికత, సంస్కృతులను ఇముడ్చుకున్న జిల్లాకు 4500 ఏళ్ల చరిత్ర ఉంది. జిల్లాలోని నదీలోయ ప్రాంతాల్లో ఆది మానవుడు సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. తొలి శతాబ్దం కన్నా ముందు ఇక్కడ ఉన్నత మానవ నాగరికత విలసిల్లినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. శాతవాహనులకు పూర్వం జిల్లాలో బౌద్ధం, జైనం పరిఢవిల్లింది. కొలనుపాకలోని జైన దేవాలయం, నాగార్జున సాగర్‌ విజయపురిలోని బౌద్ధారామాలు, విశ్వవిద్యాలయ శిథిలాలు, ఆచార్య నాగార్జునుని కృషి ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, కాయస్తులు, కుందూరు చోళులు, రెడ్డి వంశీయులు, పద్మనాయకులు, గజపతులు, బహమనీ గోల్కొండ సుల్తానులు, అసఫ్‌జాహి వంశీయులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లాలోని తుమ్మలగూడెం విష్ణుకుండినుల మొదటి రాజధాని. కొలనుపాక కల్యాణీ చాళుక్యుల రాజధానుల్లో ఒకటి. పానగల్లు కుందూరు చోళుల రాజధాని. ఆమనగల్లు, పిల్లలమర్రి రేచర్ల రెడ్ల రాజధానులు. ఆమనగల్లు, రాచకొండ, దేవరకొండ రేచర్ల పద్మనాయకుల రాజధానులు. ఇలా నల్గొండ అనేక రాజ్యాలకు కేంద్రస్థానంగా ఉంది.

భౌగోళిక పరిస్థితి

జిల్లాకు తూర్పున కృష్ణా, ఖమ్మం జిల్లాలు, పశ్చిమాన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు, ఉత్తరాన వరంగల్‌, మెదక్‌ జిల్లాలు, దక్షిణాన గుంటూరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి. ఈ జిల్లా నీలగిరిగా పేరొందింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 16.25-17.50 ఉత్తర అక్షాంశ రేఖలకు 78.40- 80.50 పూర్వ దీర్ఘాంశ రేఖలకు మధ్య 14.247 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. 27 మండలాల్లో 858.30 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. భౌగోళిక స్వరూపాన్ని అవలోకిస్తే… నైరుతి-వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ, ఈశాన్య దిశకు వాలి ఉంది. అనేక చిన్న, పెద్ద పర్వతాలను తన ఒడిలో దాచుకుంది. సరిహద్దుల విషయానికి వస్తే ఉత్తరాన మెదక్‌, వరంగల్‌ తూర్పున ఖమ్మం, కృష్ణా దక్షిణాన మహబూబ్‌నగర్‌, పశ్చిమాన రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 6.03 శాతం అడవులున్నాయి. 16 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. జిల్లాలోని ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 300-900 అడుగుల ఎత్తున ఉంటాయి.

నేలల స్వభావం

జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలు, తోడు ఇసుక నేలలు 47శాతం, నల్లరేగడి 9శాతం, చెలక భూములు 44శాతం ఉన్నాయి. శీతోష్ణస్థితి గమనిస్తే వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. వేసవిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. నైరుతీ రుతుపవనాల సమయంలో తప్ప సాధారణంగా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాపాతం నైరుతితోపాటు ఈశాన్య రుతు పవనాలు, తుపానుల వల్ల వర్షాలు కురుస్తాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసే వర్షాలే మొత్తం సంవత్సర వర్షపాతంలో 70శాతం ఉంటుంది. జిల్లాలో సంవత్సర సాధారణ వర్షపాతం 741 మిల్లీమీటర్లు.

సున్నపురాయి నిల్వలకు జిల్లా పెట్టింది పేరుగా నిలిచింది. సున్నపురాయి ఆధారంగానే జిల్లాలో అనేక సిమెంటు పరిశ్రమలు నెలకొన్నాయి. సిమెంటు ఉత్పత్తుల్లో జిల్లా అగ్రభాగాన నిలిచింది. ఈ సున్నపురాయి బూడిద, తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమవన్నె ఇంకా రక్తనీలపు రంగులతో లభిస్తుంది. క్వార్జ్‌ గ్రానైట్స్‌, స్టోన్స్‌, యురేనియం ఖనిజ నిక్షేపాలు కూడా లభిస్తున్నాయి. దేవరకొండ సమీపంలో ఏలేశ్వరం వద్ద కృష్ణానది నల్గొండ జిల్లాలో అడుగుపెట్టి తూర్పు వైపుగా 85 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లాకు వెళుతోంది. జిల్లాలో ప్రధాన పంట వరి కాగా, మెట్ట పంటల విషయంలో దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఆముదం పంటను పండిస్తున్న జిల్లాగా పేరొందింది. ప్రస్తుతం పత్తి పంట సాగు కూడా గణనీయంగా పెరిగింది. సుమారు 2లక్షల సాగు విస్తీర్ణం ఉంది. అదే విధంగా బత్తాయి, నిమ్మ తోటల పెంపకంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోనే రైస్‌ మిల్లు పరిశ్రమలకు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్రాలు పోచంపల్లి కేంద్రంగా ఉత్పత్తి అవుతున్నాయి. నాణ్యమైన పాల ఉత్పత్తులకు కూడా జిల్లా పేరుగాంచింది. మత్స్య సంపదకు కొదవలేదు. గీత వృత్తిపై లక్షలాది మంది వృత్తిదారులు ఆధారపడి జీవిస్తున్నారు. పశుసంపద కూడా గణనీయంగా ఉంది. మేకలు, గొర్రెల పెంపకంలో కూడా జిల్లా ప్రసిద్ధి గాంచింది.

సామాజిక విశేషాలు

నల్గొండ జిల్లా భిన్న సంస్కృతుల సమ్మేళనం.భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నప్పటికి ఇక్కడి ప్రజలు ఐకమత్యంగా ఉంటారు. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉంటుంది. ఇందులో 4.32 లక్షలకు పైగా పట్టణ ప్రాంతాలలో ఉండగా 28 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. ప్రధాన జీవనాధారం వ్యవసాయం. జనాభాలో దాదాపు 56 శాతం వరకు వెనుకబడిన కులాల వారే! ఎస్సీలు 17.72 శాతం, ఎస్టీలు 10.55 శాతం ఓసీలు 10 శాతం, మైనారిటీలు 6 శాతం వరకు ఉన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. అక్షరాస్యత 57.2 శాతం.

పోరాటాల ఖిల్లా నల్లగొండ

నిజాం నిరంకుశ, పాశవిక, అరాచక చర్యలకు వ్యతిరేకంగా తుపాకులు చేతపట్టి, గళాలు విప్పి, ప్రజల వెన్నుతట్టి వీరోచితంగా పోరాటం నడిపించిన జిల్లా నల్లగొండ. ఉద్యమాలే వూపిరిగా, పోరాటమే లక్ష్యంగా నిజాం గుండెల్లో నిద్రపోయేలా ఉద్యమించిన ఘనచరిత్ర నల్లగొండకు ఉంది. నిజాం ముష్కరపాలనకు చరమగీతం పాడేందుకు సర్వస్వం ఒడ్డిన పోరాటయోధులు పుట్టినది నల్లగొండ జిల్లాలోనే.

రవి అస్తమించని బ్రిటిష్‌ పాలన అంతమొందినా నైజాం నవాబు సర్వ స్వతంత్రుడనని ప్రకటించుకొని తెలంగాణ ప్రజలపై రాక్షసంగా హింసాకాండ సాగించారు. అనేకమంది ప్రజలు దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమాలకు గురై జీవచ్ఛవాలయ్యారు. నిజాం ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం శ్రమించినా కష్టజీవులకు పూటగడవడం కష్టమైంది. నైజాంకు గులాములైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు, సర్ధేవ్‌ముఖ్‌లు ప్రజలు చేత వెట్టి చాకిరి చేయించారు. ఆభరణాలకు అప్పులిచ్చి వడ్డీ, చక్రవడ్డీలు కలిపి ప్రజలను పీల్చి పిప్పి చేశారు. వీరికి తోడు నైజాం తన పోలీసులనే కాక ఖాసీం రజ్వీతో 50వేల మంది రజాకార్లను తయారు చేసి ప్రజలపైకి వదిలాడు. వీరంతా గ్రామ గ్రామాన ప్రజలపై పడి దోపిడీని యధేచ్ఛగా కొనసాగించారు. ప్రతిఘటించిన వారిని తుపాకీ గుళ్లకు బలిచేశారు. ఇలాంటి నీచ నికృష్టమైన నైజాం పాలనను తుదముట్టించడానికి అనేకమంది నాయకులు సాయుధ పోరుకు సన్నద్ధులయ్యారు. తొలుత నల్గొండ జిల్లా కొలనుపాకలో ఆంధ్ర మహాసభలో చురుకుగా పాల్గొన్న ఆరుట్ల లక్ష్మి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి 1935, 36 సంవత్సరాల మధ్యకాలంలో జాగీర్ధారీ వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు. పన్నులు చెల్లించమని సహాయ నిరాకరణ ఉద్యమాలను నడిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా బెల్లం కొండయ్య అనే రైతు నాయకత్వంలో తిరుగుబాటు చేసినందుకు నైజాం ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి బెల్లం కొండయ్య, రాంచంద్రారెడ్డి మద్దిపాపిరెడ్డిపై అనేక కేసులు పెట్టినా అవి నిలువలేదు. వీరి పోరాటాల స్ఫూర్తితో నిరంకుశ సంకెళ్లను తెంచేందుకు సమాయత్తమయ్యారు. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్ర మహాసభ అప్పులు, భూమిశిస్తు చెల్లించవద్దని విప్లవాత్మకమైన తీర్మానాన్ని చేసింది. దీనికి తోడు కమ్యూనిస్టులు రంగ ప్రవేశం చేసి ప్రజలకు అండగా నిలిచారు. ఈ తీర్మానాలతో కోపోద్రిక్తులైన రజాకార్లు పన్నులు చెల్లించని ప్రజలను కాల్చిచంపారు. స్త్రీలను చెరిచారు. ప్రజా ఉద్యమాలను అణచడానికి సూర్యాపేట తాలూకా బాలెంల గ్రామంపై దాడిచేసి ఇద్దరు కమ్యూనిస్టు కార్యకర్తలను హతమార్చారు. 1946లో పాత సూర్యాపేటపై దాడిచేసి సరసాని నర్సయ్యను చంపారు. ఇంకా దేవరుప్పల, కామారెడ్డిగూడెం, పులిగడ్డల మల్లారెడ్డిగూడెంలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో 390మంది రైతులు హతులయ్యారు. 64మంది మహిళలను చెరిచారు. ఈ సంఘటనలో నాలుగు వేలమంది రైతులను అరెస్టు చేశారు. ఈ ఘోరకృత్యాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దాం మొయినుద్దీన్‌ 1947 సెప్టెంబర్‌లో నైజాం పాలనను అంతమొందించేందుకు సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. పార్టీ యంత్రాంగాన్ని రహస్య పద్ధతుల్లో నిర్మాణంచేసి పోరాటాలకు వ్యూహాలను పన్నారు. గెరిల్లా దళాలు నిర్మించి దాడులు సాగించారు. గ్రామాల్లో గెరిల్లా దళాలే పరిపాలన సాగించాయి. జాగీర్దారుల ఆధీనంలో ఉన్న 10-12 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంచారు. నైజాంల దొంగ నిల్వలను వెలికితీసి ప్రజలకు పంపిణీ చేశారు. ‘గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాం సర్కరోడా’ అంటూ మహిళలు సైతం పోరాటాలకు పిలుపునిచ్చారు.